E - PAPER

E-PAPER

అసెంబ్లీకి వైఎస్ జగన్ గుడ్‌బై..?

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. పార్టీ నాయకులను కలుస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సొంత నియోజకవర్గానికి వెళ్లనుండటం ఇది రెండోసారి.

 

ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు. శనివారం ఉదయం జగన్.. తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు వెళ్తారు. ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. 8వ తేదీన ఉదయం వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు.

ఈ పర్యటన సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కనిష్ఠ స్థాయిలో 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండటం, ప్రతిపక్ష హోదా లేకపోవడం.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రాజీనామా చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్.. పులివెందుల నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి డాక్టర్ సుధ (బద్వేలు), ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి (రాజంపేట) మాత్రమే గెలిచారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ ఆశించిన స్థాయిలో బలంగా లేదనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేసినట్టయింది.

 

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గతంలో వైఎస్ జగన్ లేఖ రాసినా అధికార తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి నుంచి సానుకూల స్పందన రాలేదు. చచ్చేంత వరకు జగన్‌ను కొట్టాలి.. అంటూ వ్యాఖ్యానించిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ఎన్నుకోవడాన్ని సైతం ఆయన తప్పుపట్టిన విషయం తెలిసిందే.

 

ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అసెంబ్లీకి వెళ్లడానికి జగన్ ఇష్టపడట్లేదని చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్.. లోక్‌సభకు పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో జగన్ నిలబడొచ్చని చెబుతున్నారు.

తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తన తల్లి వైఎస్ విజయమ్మను బరిలో దింపుతారని తెలుస్తోంది. పులివెందుల నుంచి తల్లిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది.

 

ఉమ్మడి ఏపీలో విజయమ్మ అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అత్యంత బలమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీని బతికించుకోగలిగారామె. ఇప్పుడు మళ్లీ పార్టీ బలహీనపడినట్టు భావిస్తోన్న నేపథ్యంలో విజయమ్మ సహకారాన్ని తీసుకోవాలని జగన్.. ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటైంది. మరో వైపు కాంగ్రెస్ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బలపడింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంతగా బలమైన పక్షంగా నిలిచింది.

 

ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని జగన్ యోచిస్తోన్నట్లు చెబుతున్నారు. లోక్‌సభకు వెళ్లడం వల్ల మున్ముందు జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయంపై జగన్‌కు సమగ్ర అవగాహన సైతం ఏర్పడినట్టవుతుందనే వాదనలూ లేకపోలేదు.

Facebook
WhatsApp
Twitter
Telegram