ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం వెంట ప్రధాని మోదీ వద్దకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే విభజన హామీలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీతో భేటీకి ముందు సీఎం రేవంత్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాల పైన కేంద్రం నుంచి కీలక హామీ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధానితో చర్చలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. తమ సమస్యల పైన ప్రదాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అవుతాయని రేవంత్ స్పష్టం చేసారు.
కేంద్రం హామీ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పైన ప్రదానంగా చర్చించారు. కాజీపేట్ రైల్వే కోచ్ విషయం ఈ భేటీలో గుర్తు చేసారు. ఐటీఐఆర్ తెలంగాణకు ఇవ్వాలని కోరారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో సహకారం అందించాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభ్యర్దించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పైన ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు చేస్తున్నట్లు అమిత్ షా కు వివరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకోవలని..తమ సహకారం ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు.
హైకమాండ్ దే నిర్ణయం ఇక, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ నెల 7వ తేదీతో పీసీసీ చీఫ్ గా తన కాల పరిమితి ముగుస్తుందన్నారు. కొత్త పీసీసీ చీఫ్ తో పాటుగా మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకోవాలని తాను పార్టీ నాయకత్వాన్ని కోరానని వెల్లడించారు. కేసీఆర్ టార్చ్ లైట్ వేసుకొని తమ వద్దకు వస్తారంటూ చేసిన వ్యాఖ్యల పైన రేవంత్ స్పందించారు. కేసీఆర్ టార్చ్ లైట్ వేసుకొని బీఆర్ఎస్ ఎక్కడ ఉందో వెతుకులాడాలని వ్యాఖ్యానించారు.