తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పంజా విసురుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి చేరికలకు గేట్లు ఎత్తేశారు. దీనికి దెబ్బకు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కకావికలమౌతోంది. తేరుకోలేకపోతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ తొలి ఆరు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు.
కే కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య.. వంటి ఎంతోమంది బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో ఉన్నారు.
దీనికి ఇక్కడితో బ్రేకులు పడలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఆరుమంది బీఆర్ఎస్‌కు చెందిన శాసన మండలి సభ్యులు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
అర్ధరాత్రి ఈ చేరికలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరిన వెంటనే ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.