ఏపీలో గంజాయిపై యుద్ధం మొదలైందని, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న మంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు.
గంజాయి కట్టడికి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బోర్డర్ లలో చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని, పటిష్టం చెయ్యాలని నిర్ణయించినట్టు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. కుటుంబాలకు కూడా తీరని నష్టం జరుగుతుందని చెప్పారు.కావున గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనిత పేర్కొన్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గంజాయి సాగు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి పంటను నాశనం చేయడానికి గత రెండు సంవత్సరాలుగా సెబ్ కు ఎటువంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదని హోం మంత్రి అనిత చెప్పారు. గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టే వారిపైన ,రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి కింగ్ పిన్, కీ రోల్ పోషించే వారి డేటా ఉందన్నారు.
గంజాయి, డ్రగ్స్ కేసులలో ఖైదీలుగా మైనర్లే మత్తు పదార్థాలను అలవాటును నియంత్రించే డి-అడిక్షన్ కేంద్రాలు,పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాల దశ నుంచే విద్యార్దులకు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ నుండి బయటకు తీసుకొస్తామన్నారు.రాష్ట్రంలో ఈ కేసుల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నవారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు.
గంజాయి సాగుపై సమాచారమిస్తే బహుమతులు గంజాయి సాగుకు పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు. డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన వారు ఎవరనే దానిపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపటంలో భాగంగా ముందుగా వంద రోజులలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని,గంజాయి సాగుపై సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం తరఫున తగిన బహుమతులు కూడా అందిస్తామని మంత్రి అనిత పేర్కొన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించటం కోసం కంకణబద్ధులై ఉన్నామన్నారు