తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదానిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో చర్చలు జరిపింది. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేదానిపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. దీంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మొత్తం 17 మంది మంత్రులకు గాను 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసందే. ఆరు మంత్రి పదవులను లోక్ సభ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని నిర్ణయించింది. లోక్ ఎన్నికలు ముగియడంతో మంత్రి పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. సామాజిక సమీకరణాలు, పార్లమెంటు ఎన్నికల పెర్ ఫార్మెన్స్ ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వాలని భావించింది. దీంతో రాష్ట్రంలో పలువురికి మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరిగింది.
రాష్ట్ర నాయకులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మంత్రుల ఎంపికను ఏఐసీసీకే అప్పగించారు. అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలోనే కేకేకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.
పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీసీసీ రేసులో ప్రధానంగా మహేశ్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తోంది. మంత్రి పదవి, పీసీసీ చీఫ్ కోసం ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.