E-PAPER

జగన్ గురించి సంచలన విషయాలను బయటపెట్టిన ఆరా మస్తాన్..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు చేసిన మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చగా, కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. అలా ప్రకటించిన సర్వేల్లో ఆరా సర్వే కూడా ఒకటి. ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.

 

టీడీపీ,జనసేన నేతలు సైతం ఆరా మస్తాన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుంటుందని ఆరా మస్తాన్ తెలిపారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది. ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు ఆరా సర్వేకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.

 

దీంతో ఆరా మస్తాన్ చేసిన సర్వేపై అనుమానాలు మొదలైయ్యాయి. జగన్ ఒత్తిడితోనే ఆరా మస్తాన్ వైసీపీకి అనుకూలంగా సర్వే రిపోర్టును మార్చేశారని విమర్శలొచ్చాయి. టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత ఆరా మస్తాన్ ఎక్కడ కూడా బయట కనిపించలేదు. అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్టు జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆరా మస్తాన్‌ను ఇంటర్య్వూ చేశారు. ఈ సందర్భంగా జాఫర్ పలు ఆసక్తికర ప్రశ్నలు ఆరా మస్తాన్‌ను ప్రశ్నించారు. ఖురాన్, భగవద్గీత మీద ప్రమాణం చేసి తాను అంత నిజమే చెబుతానని ఆరా మస్తాన్ తెలిపారు. మిమ్మల్ని జగన్ పిలిచి వైసీపీకి అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని అడిగారా అని ఆరా మస్తాన్‌ను జాఫర్ ప్రశ్నించారు.

 

దీనిపై ఆయన సమాధానం చెబుతూ..నేను జగన్‌ను కలవలేదని, వైసీపీకి అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని జగన్ కోరలేదని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. ఒకర్ని పిలిచి తమకు అనుకూలంగా ఉండాలని కోరే మనస్థాత్వం జగన్‌ది కాదని ఆరా మస్తాన్ తెలిపారు. అలా చేయాల్సి వస్తే జగన్ చాలామందిని వదులుకునే వారు కాదని ఆయన పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు,వంటి నేతలను పిలిచి మాట్లాడి వారితో సయోధ్య చేసుకునే వారని.. కానీ జగన్ వ్యక్తిత్వం అలాంటిది కాదని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు. బహుశ నా సర్వేనే ఎక్కడో ఫెయిల్ అయి ఉంటుందని ఆరా మస్తాన్ అభిప్రాయపడ్డారు.

Facebook
WhatsApp
Twitter
Telegram