జాబిల్లిపై నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) పంపిన చంద్రయాన్ 3 మిషన్ అంచనాలను మించి విజయవంతమైంది. దీంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఎన్నో రెట్లు పెరిగింది. అదే సమయంలో రష్యాతో పాటు మరికొన్ని దేశాలు కూడా పోటీగా చంద్రుడిపైకి ఇలాంటి మిషన్లు ప్రయోగించినా విఫలమయ్యాయి. దీంతో భారత్ కు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు దక్కాయి.
అయితే గతేడాది జూలైలో చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలను ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ఆ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అప్పట్లో ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దాని ప్రయోగ సమయం విషయంలో ఓ చిక్కుముడి ఎదురైంది. అయినా రిస్క్ తీసుకుని ప్రయోగం చేపట్టే పరిస్ధితి లేదు. అలా చేస్తే మొత్తం మిషన్ క్రాష్ అయ్యే ప్రమాదం పొంచి ఉందట.
దీన్ని గ్రహించిన ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న సమయం కంటే నాలుగు సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3 ను ఆకాశంలోకి పంపారు. దీంతో ఇది విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే కాకుండా అక్కడ రోవర్ తో ల్యాండర్ విడిపోయి ఉపరితలంపై తిరగడం, అక్కడి ఫొటోలు, వీడియోలు తీయడం, మట్టి రేణువుల్ని భూమికి పంపడం ఇలా చాలా పనులే చేసింది. అయితే ఈ నాలుగు సెకన్లు ఆలస్యం చేయకుండా ముందుగా అనుకున్న సమయానికి ప్రయోగిస్తే మాత్రం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అప్పట్లో తేలిందట.
చంద్రయాన్ -3 నౌకకూ, అంతరిక్ష శిధిలాల మధ్య క్రాష్ జరిగే ప్రమాదాన్ని తాము ఇలా ప్రయోగం 4 సెకన్లు ఆలస్యం చేయడ ద్వారా నివారించినట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇలా ప్రమాదాన్ని ఇస్రో నివారించడంలో ఖచ్చితత్వంతో పాటు చురుకైన అంతరిక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలు దోహదం చేసినట్లు చెబుతోంది. చంద్రయాన్ 3లో కీలకమైన ప్రారంభ కక్ష్య దశలో దాని మార్గంతో కలుస్తున్న ఒక పథంలో అంతరిక్ష శిధిలాల భాగాన్ని గుర్తించారు. వ్యర్థాలు, మునుపటి అంతరిక్ష మిషన్ల అవశేషాలు, అంతరిక్షంలో వస్తువులు ప్రయాణించే అధిక వేగాల కారణంగా దీనికి తీవ్ర ముప్పు ఉందని గుర్తించారు. దీంతో చివర్లో 4 సెకన్లు ఆలస్యం చేసి ప్రమాదాన్ని అడ్డుకున్నారు.