ఏపీలో ఎన్నికలకు మరో 15 రోజులే మిగిలున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు, నాయకులు మ్యానిఫెస్టో అద్బుతమని చెప్తుంటే.. విపక్షాలు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన విపక్ష నేత చంద్రబాబు వైసీపీ మ్యానిఫెస్టోపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
“జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో ఇవి కొన్ని అంటూ ఆయన ఓ వీడియోను కూడా దీనికి జత చేశారు. ఇందులో జగన్ గతంలో ప్రకటించిన 2019 మ్యానిఫెస్టో హామీలు ఉన్నాయి. వీటిని ప్రస్తావిస్తూ.. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని చంద్రబాబు తెలిపారు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదన్నారు. ఈరోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడన్నారు.
మళ్ళీ ఇంకోసారి మోసపోడానికి మీరు సిద్ధమా అని జగన్ అడుగుతాడని,, నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండని చంద్రబాబు ప్రజలకు సూచించారు. వైసీపీ 2019లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో హామీల్ని 99 శాతం నెరవేర్చామని ఇవాళ సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే వైసీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ నెరవేర్చని హామీలపై చంద్రబాబు వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.