E-PAPER

ఏపీలో తేలిన నామినేషన్ల లెక్క..! వివరాలివే….

ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల లెక్క తేలింది. ఇప్పటికే దాఖలైన నామినేషన్ల పరిశీలనను నిన్న చేపట్టిన ఎన్నికల అధికారులు.. ఇవాళ్టికి లెక్క తేల్చారు. ఎన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ వెల్లడించారు.

 

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించి మొత్తం 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ సీట్లకు సంబంధించి 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు ఆయన తెలిపారు. ఇందులో 25 పార్లమెంట్ సీట్లకు 503 నామినేషన్లను ఆమోదించినట్లు సీఈవో తెలిపారు. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2705 నామినేషన్లు ఆమోదించారు. అలాగే పార్లమెంట్ స్దానాల్లో 183 నామినేషన్లు తిరస్కరించారు. అసెంబ్లీ సీట్లలో 939 నామినేషన్లు తిరస్కరించారు.

 

పార్లమెంట్ సీట్లలో అత్యధికంగా గుంటూరుకు 47 నామినేషన్లు, అత్యల్పంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్ధానంలో 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే నంద్యాల పార్లమెంట్ స్ధానంలో అత్యధికంగా 36 నామినేషన్లు, అత్యల్పంగా రాజమండ్రి సీటులో 12 నామినేషన్లు ఆమోదించారు. అసెంబ్లీ సీట్లలో గరిష్టంగా తిరుపతి సీటుకు 52 నామినేషన్లు, అత్యల్పంగా చోడవరం స్ధానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి.

 

ఇందులో తిరుపతి సీటులో గరిష్టంగా 48 నామినేషన్లు, చోడవరంలో అత్యల్పంగా 6 నామినేషన్లు ఆమోదించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram