వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి వివరించారాయన. నవరత్నాలు పేరిట ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందించామో వీడియో ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని జగన్ అన్నారు.
ఈ ఐదేళ్లలో మేనిఫెస్టోకే గౌరవం వచ్చిందని వెల్లడించారు. 2019 మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామన్నారు. 2019 మే అంశాలను నిష్టతతో అమలు చేశామని తెలిపారు. నేరుగా సొంత ఖాతాల్లో డబ్బులు పంపిణీ చేశామని చెప్పారు. ఇక 2024 ఎన్నికలకు సంబంధించిన హామీలను సైతం సవివరంగా వివరించారు. గడిచిన ఐదేళ్లలో ఏం చేశామో చెబుతూనే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో కూడా సీఎం జగన్ తెలియజేశారు.
నవరత్నాలను యథావిథిగా కొనసాగిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్టుల నిర్మాణంతో పాటు వాలంటీర్ల వ్యవస్థ వంటి పలు అంశాలకు జగన్ పెద్దపీట వేశారు. అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి రూ.17 వేలు అందిస్తామని తెలిపారు.తల్లులకు ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తామన్న సీఎం జగన్ మిగతా రూ.2000 స్కూల్స్ కోసమని తెలిపారు.
మహిళల కోసం.వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామన్నారు. అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్న వైఎస్ఆర్ చేయూత రూ.75 వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచుతామన్నారు.వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ కార్యక్రమం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాపు నేస్తంను నాలుగు దఫాల్లో రూ.లక్షా 20 వేలకు పెంచుతామని సీఎం జగన్ మ్యానిఫెస్టోలో తెలిపారు.
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో.రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేలకు పెంపుతో పాటు పేదలకు ఆసరా పెన్షన్ రూ.3,500 కు పెంచుతామన్నారు. అలాగే రైతుల కోసం మ్యానిఫెస్టోలో కీలక అంశాలను చేర్చారు.రైతు భరోసా నగదును రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచారు.అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు.పేదలకు సొంతిటి కలను సాకారం చేస్తామన్న సీఎం జగన్ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతాయని తెలిపారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం వంటి పథకాలు యథావిథిగా కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.మూడు రాజధానుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు.వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.భూముల రీసర్వే చేపడతామని, భోగాపురం ఎయిర్ పోర్టు కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు.
విద్యారంగంలో ఇప్పటికే కీలక సంస్కరణలు తెచ్చామన్న సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తామని తెలిపారు.అదేవిధంగా ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్ లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ తరహాలోనే వచ్చే ఐదేళ్లు కూడా సుపరిపాలన అందిస్తామని సీఎం జగన్ తెలిపారు.అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.