ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఎన్నికలు ఈవీఎం విధానంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈవీఎంలో బరిలో ఉన్న అభ్యర్ధుల పేర్లు, గుర్తులతో పాటు నోటా ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అయితే అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటివరకూ ఇలా జరగకపోవడంతో దీనిపై సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ పిల్ దాఖలైంది.
ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేరా ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఇలా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారో చెప్పాలంటూ ఈసీని సుప్రీంకోర్టు కోరింది.
మరోవైపు నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించేలా నిబంధధనలు విధించాలంటూ కూడా పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. అలాగే నోటాను “కల్పిత అభ్యర్థి”గా సరైన ప్రచారం కల్పించేలా చూడాలని కూడా కోరారు. తాజాగా సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికలు లేకుండానే బిజెపి అభ్యర్థి విజేతగా ప్రకటించడాన్ని గుర్తుచేశారు. ఇలాంటి సందర్భాల్లో నోటా అవసరం ఉంటుందన్నారు.