బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పార్టీ నుండి వెళ్లిపోయిన వారు ఒకరకంగా వేధిస్తుంటే, పార్టీలో కొనసాగుతున్న వారు మరోరకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక ఆ కోవలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు మాజీ మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మల్లారెడ్డి అప్పుడప్పుడు ఆయన ప్రవర్తించే తీరు అసలు ఆ పార్టీ కోసమే పని చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది.
మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికలలో ఇప్పటికే ఎదురీదుతున్న బీఆర్ఎస్ పార్టీకి పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో కలసి ఒక వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ వివాహ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నా నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి ఈటల రాజేందర్ దగ్గరకు నేరుగా వెళ్లిన మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నా నువ్వే గెలుస్తున్నావ్ అన్న అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈటల రాజేందర్ ను అలింగనం చేసుకోవడం మాత్రమే కాకుండా, అన్న తోటి ఫోటో తీయండి అంటూ ఈటల రాజేందర్ తో కలిసి ఫోటోలు కూడా దిగారు మాజీ మంత్రి మల్లారెడ్డి.
బీఆర్ఎస్ కు షాకిస్తున్న మల్లారెడ్డి కామెంట్స్ ఇప్పుడు మల్లారెడ్డి ఈటల రాజేందర్ తో కలిసి చేస్తున్న హల్ చల్ తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన రాగిడి లక్ష్మారెడ్డికి, మద్దతు తెలుపవలసిన మాజీ మంత్రి మల్లారెడ్డి అలాకాకుండా ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది.
మల్లారెడ్డి రూటే సపరేటు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా మాట్లాడవలసిన పార్టీ నేతలు, అలాకాకుండా ప్రత్యర్థులే గెలుస్తారు అన్నట్టుగా మాట్లాడటం కెసిఆర్ కు షాక్ అని చెప్పాలి. ఇక మల్లారెడ్డి తాజా చర్యలతో ఇది చూసిన వారంతా మల్లారెడ్డి రూటే సపరేటు అంటున్నారు.