బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పెద్దశంకర్‌పేట్, జహీరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం పదేళ్లపాటు కేసీఆర్ కబంధహస్తాల్లో చిక్కుకుందని.. డిసెంబర్‌లో కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ యువత రాష్ట్రం కోసం పోరాటం చేస్తే పేదల ఉద్యోగాల గురించి కేసీఆర్ పదేళ్ల పాటు పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు రేవంత్.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసి దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, డీఆర్‌డీవో వంటి ఎన్నో సంస్థలను ఇచ్చిందని.. అయితే, ఈ పదేళ్లలో హైదరాబాద్‌కు మోడీ ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చారా? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.