E-PAPER

గులాబీ సైనికులకు కేటీఆర్ సందేశం..

ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమతి 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు. మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

 

అనంతరం కేటీఆర్ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రాణాలను అర్పించిన అమర వీరులకు కేటీఆర్ నివాళి అర్పించారు. ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమేనని వ్యాఖ్యానించారు.

గెలిచినా, ఓడినా తెలంగాణ ప్రజల తరఫున పోరాడేది, వారి గొంతుకగా ఉండేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోబోమని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా తమను కించపరిచే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలకు సేవలను అందించే విషయం వెనుకంజ వేయబోమని కేటీఆర్ అన్నారు.

 

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ గతంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ఉటంకించారు. తెలంగాణకు ఒక ఇంటి పార్టీగా ఉంటోన్నది తామేనని, అలాంటి బీఆర్ఎస్‌కు ఈ 24 సంవత్సరాల వ్యవధిలో ప్రజలు ఎంతగానో ఆదరించారని కేటీఆర్ అన్నారు.

 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు కడుపు కాల్చుకుంటూ బీఆర్ఎస్ కోసం పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సేవకు తాము పునరంకితమౌతామని కేటీఆర్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సమాజం చూపిన బాటలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram