E-PAPER

పెన్షన్ల పంపిణీపై సీఎస్ కు ఈసీ తాజా ఆదేశాలు – కానీ,..!!

ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ మరోసారి కీలక అంశంగా మారుతోంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల అంశం రాజకీయ వివాదంగా మారింది. దీంతో, మే నెల పెన్షన్ల పంపిణీ పైన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి లేఖలు రాసాయి. ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. తాజాగా సీఎస్ నుంచి ఈసీకి పెన్షన్ల పంపిణీ పైన నివేదిక అందింది. ఇదే సమయంలో పెన్షన్ల అంశం పైన ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

 

ఈసీ తాజా మార్గదర్శకాలు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయమై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం గుర్తు చేసింది.

ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించామని..అవే మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఈసీ స్పష్టం చేసింది.

 

ఇంటి వద్దే ఇవ్వాలి అయితే, ఇదే సమయంలో మే 1న పెన్షన్ల పంపిణీ పైన సీఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. అందులో కీలక అంశాలు ప్రస్తావించారు. ఇంటింటికీ పింఛను పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్‌ అధికారు లతో , కలెక్టర్లతో సమీక్షించామని.. అది సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈసీకి పంపిన లేఖలో రాష్ట్రంలో 15,.004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికిగాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే… సగటున ఒక్కో సచివాలయంలో పని చేస్తున్నది 8 మందిమాత్రమేనని స్పష్టం చేసారు. 41 వేల మంది బీఎల్‌వో విధులతో చాలా బిజీగా ఉన్నారు. 55,900 మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వడం సాధ్యపడదని క్లారిటీ ఇచ్చారు.

 

ప్రభుత్వం వివరణ దీంతో, గత నెలలోలాగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్లవద్ద పింఛను అందిస్తామని స్పష్టం చేశారు. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్ఠంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పింఛను పంపిణీకి దాదాపు 10వేల అదనపు కేంద్రాలను గుర్తించామని… వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటు ఎన్నికల సంఘం తాము ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని సీఎస్ కు స్పష్టం చేయటంతో…పెన్షన్ల పంపిణీ అంశంలో ఏ రకంగా వ్యవహరిస్తారు…ఏం జరుగుతుందనే ఉత్కంఠ లబ్దిదారుల్లోనూ..రాజకీయంగానూ మొదలైంది.

Facebook
WhatsApp
Twitter
Telegram