E-PAPER

బీసీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక హామీలు..

అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన హామీల్ని సీఎం జగన్ నిలబెట్టుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో విమర్శించారు. గత ఎన్నికలకు ముందు జయహో బీసీ అంటూ ఏలూరులో సభ పెట్టిన జగన్ అప్పట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రస్తుతం పేర్లు మార్చి అమలు చేస్తున్న పథకాలు కూడా అరకొరగానే ఇస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇసుక ఆపేసి భవన నిర్మాణ రంగంలో ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టారని పవన్ మండిపడ్డారు.

 

బీసీ కులాలు యాచించే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాడినని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీసీ కులాలు భారత దేశ సంస్కృతికి ప్రతిబింబం అన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుతున్నది బీసీలే అన్నారు. బీసీ కార్పోరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవని పవన్ ఆరోపించారు. వైసీపీ పాలనలో 300 మంది బీసీల్ని చంపేశారన్నారు. కాబట్టి వైసీపీలో ఉన్న బీసీలు ఇవన్నీ గమనించాలని పవన్ కోరారు.

 

చంద్రబాబుతో కలిసి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన పవన్.. సంపద కోసం యాచించకుండా సంపద సృష్టించేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మత్సకారుల కోసం ప్రతీ 30 కిలోమీటర్లకో జెట్టీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. బీసీల దగ్గర డబ్బు ఉండకూడదనే దురుద్దేశంతో సీఎం జగన్ జీవో నంబర్ 2 తీసుకొచ్చారని పవన్ విమర్శించారు. 153 బీసీ కులాలకు ఆర్ధిక పరిపుష్టి చేకూర్చేందుకు జనసేన అండగా ఉంటుందన్నారు. బీసీలపై దాడులు జరిగితే తమ ప్రాణాలు అడ్డేసి అండగా ఉంటామన్నారు.

బీసీ కులాల్లో ఉన్న అనైక్యత కారణంగానే జగన్ ఇలా ఉన్నారని పవన్ తెలిపారు. బీసీ కులాలకు టీడీపీ-జనసేన రెండు పార్టీలు అండగా ఉంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం రాని కులాలకు అధికారం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఇంకా అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన కులాల్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

 

జగన్ అధికారంలోకి రాగానే బీసీ కులాల రిజర్వేషన్ తగ్గించారని, దీన్ని టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram