E-PAPER

ఏపీ సచివాలయం ఇలా ఉండబోతోంది.. జగన్ అంతరంగం ఆవిష్కరణ..

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్సొరేషన్-వీఎంఆర్డీఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను- మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజినితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

 

అనంత‌రం రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వ‌హించిన‌ విజన్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఈ స‌ద‌స్సులో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరించారు.

 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజన్ విశాఖ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. 8:48 నిమిషాల పాటు ఉండే ఈ వీడియో- వైఎస్ జగన్ అంతరంగాన్ని ప్రతిఫలింపజేసింది. విశాఖలో ఈ అయిదు సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఇందులో పొందుపరిచారు.

 

ఇన్ఫోసిస్, అదాని డేటా సెంటర్ పెట్టుబడులు, జాతీయ రహదారులు, వైజాగ్ పోర్ట్ కనెక్టివిటీ గురించి వివరించారు. పూర్తిస్థాయి రాజధానిగా బదలాయించిన తరువాత వాహనాల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికి నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్.. వంటివి ఇందులో ఉన్నాయి.

 

అలాగే- ఎగ్జిక్యూటివ్ కేపిటల్ సిటీగా మారిన తరువాత విశాఖలో నిర్మించబోయే ప్రభుత్వ భవన కార్యాలయాల డిజైన్లు కూడా ఇందులో పొందుపరిచారు. రాష్ట్రస్థాయి సచివాలయం డిజైన్ ఎలా ఉంటుందనేది వివరించారు. దీపపు వెలుగు ఆకారంలో సచివాలయం నమూనాను డిజైన్ చేశారు.

 

ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు జగన్. ఎన్నికల్లో గెలిచిన తరువాత ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. విశాఖపట్నాన్ని పూర్తిస్థాయిలో కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని, తాను ఇక్కడే ఉంటాననీ అన్నారు. విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని అన్నారు. ఈ నగరాన్ని ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తామని జగన్ పేర్కొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram