E-PAPER

ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ.. జగన్ దూకుడు.. వరుస జిల్లాల పర్యటనలు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీలో అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్‌ను షెడ్యూల్ చేస్తుంది కేంద్ర ఎన్నికల కమిషన్.

 

షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నేడు ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్సొరేషన్-వీఎంఆర్డీఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

 

 

బుధవారం ప్రకాశం జిల్లాకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.362 లక్షలు, నెల్లూరు- 84,000 ఎకరాలకు, కడప- 27,000 ఎకరాలకు సాగునీటిని అందించడానికి ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టులో భాగం ఈ టన్నెల్.

 

దీని తరువాత 7, 8 తేదీల్లో తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభిస్తారు. రాత్రి ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.

 

8వ తేదీన ఉదయం 8:20 నిమిషాలకు ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. వైఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి, మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్, వైఎస్సార్ జంక్షన్‌ ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌, అనంతరం వైఎస్ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌, ఆదిత్యా బిర్లా యూనిట్‌ ఫేజ్‌ 1, సంయూ గ్లాస్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.

Facebook
WhatsApp
Twitter
Telegram