ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం గురించి ఆయన అబద్ధం చెప్పారని ఆరోపించారు. ప్రధాని మోదీ కుల గణనకు అంగీకరించరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర లో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్నారు.
ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించారన్నారు. దీనిని 2000 సంవత్సరంలో జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చారని పేర్కొన్నారు. మోదీ ఓబీసీకి చెందిన కుటుంబంలో జన్మించలేదు కాబట్టే జీవితాంతం కులగణనకు అంగీకరించరని అని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది.అక్కడ కొద్దినెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తొలిసారి అక్కడకు వెళ్లనున్నారు.
మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ‘భారత్ జోడో న్యాయయాత్ర’.. 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 67 రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమం.. దాదాపు 6713 కి.మీ మేర సాగనుంది.