E-PAPER

వైసీపీ నుంచి ఆ ముగ్గుర్ని రాజ్యసభకు ఎంపిక..

వైసీపీ నుంచి ఆ ముగ్గుర్ని రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఆ పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో గందరగోళానికి కాస్త తెరపడేలా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు.

 

టీటీడీ ప్రస్తుత ఛైర్మన్, ఒంగోలు మాజీ ఎంపీ, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని పెద్దలసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. తద్వారా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల సీట్ల గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారాయన. తన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ అడుగుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే మళ్లీ ఛాన్సివ్వాలని ఆయనతో పాటు, సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైవీని రాజ్యసభకు పంపిండం ద్వారా.. ఆయన కుమారుడు విక్రాంత్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని నాయకత్వం చెప్పకనే చెప్పినట్టయింది.

 

ఇక, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈసారి అసెంబ్లీ టికెట్ కోసం పట్టు పడుతున్నారు. కానీ కుదరదని నాయకత్వం తేల్చి చెప్పి.. ఆయన్ను పెద్దల సభకు పంపించాలని నిర్ణయించారు. దళిత నాయకుల నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తూ.. ఆ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారనే ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి.

 

వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నప్పటికీ.. సడెన్‌గా తెరపైకి వచ్చిన నాయకుడు మేడా రఘునాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు ఈ రఘునాథ్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన మల్లికార్జున్ రెడ్డి.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడాయనకు అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరును ప్రకటించారు.

 

మేడా ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగింది. ఆర్థికంగా స్ట్రాంగ్ ఫ్యామిలీని దూరం చేసుకునేందుకు జగన్ ఇష్టపడలేదనే సంకేతాలు పంపారు. దీంతో ఆయన సోదరుడు రఘునాథ్‌రెడ్డి రాజ్యసభకు పంపడం ద్వారా మేడా ప్రాధాన్యత పెంచామని కేడర్ చెప్పుకునే అవకాశం కలిగింది. పైగా, మేడా ఫ్యామిలీకి టీటీడీ బోర్డులోను ప్రాతినిథ్యం కల్పించిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram