ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కోడికత్తితో దాడి చేసిన నిందితుడికి బెయిల్ వచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై మీడియాతో మాట్లాడవద్దని అతడికి హైకోర్టు షరతులు విధించింది. రూ.25 వేల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.అలాగే ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది.
2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. ఆయన భుజంపై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడిని ఉంచారు. ఆ తర్వాత విశాఖపట్నం కారాగారానికి తరలించారు. ప్రస్తుతం ఈ జైలులోనే నిందితుడు ఉన్నారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాస్ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. కానీ ఎన్ఐఐ న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడు శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కొన్నిరోజుల కిందట హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియను ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని వివరించారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు జైల్లో ఇంతకాలం ఉండటం సరికాదని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఇటీవల హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ సమయంలో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. తాజాగా కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
తన కుమారుడికి బెయిల్ రావడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ తల్లి సావిత్రి అన్నారు. ఐదేళ్లుగా తన కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డానని తెలిపారు. అతడు ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించాడని ఆవేదన వ్యక్తంచేశారు. జైలులో తన కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందన్నారు. కోడికత్తి కేసును పూర్తిగా కొట్టివేయాలని శ్రీనివాస్ సోదరుడు విజ్ఞప్తి చేశారు. వాయిదాల కోసం తిరిగే స్తోమత తమకు లేదన్నారు.