E-PAPER

నారా లోకేశ్ ఎన్నికల శంఖారావం.. ..

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ మరింతగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నారు. ఈ నెల 11 నుంచి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

 

ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లేందుకు లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. యువగళం జరగని ప్రాంతాల్లో శంఖారావం పూరించాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను టీడీపీ రిలీజ్ చేసింది. ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే శంఖారావం లక్ష్యంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

 

ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో శంఖారావం నిర్వహించనున్నారు. దాదాపు 50 రోజులపాటు శంఖారావం పర్యటనలు చేపడతారు. ఇచ్చాపురంలో ఈ నెల 11న శంఖారావం తొలిసభ జరుగుతుంది. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పించేలా శంఖారావం సాగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

 

చిత్తూరు జిల్లా కుప్పంలో గతేడాది జనవరి 27న లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. చాలా జిల్లాలను చుట్టేశారు. సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్ కావడంతో పాదయాత్రను లోకేశ్ నిలిపివేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద విరామం ఇచ్చారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ యువగళం ప్రారంభించారు. 79 రోజుల తర్వాత నవంబర్ 27న మళ్లీ అక్కడి నుంచే పునఃప్రారంభించారు.

 

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగిసింది. 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో యువగళం సాగింది. మొత్తం 97 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. 232 మండలాలు,మున్సిపాలిటీల్లో , 2,028 గ్రామాల మీదుగా మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రనూ అగనంపూడి వద్దే ముగించారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram