E-PAPER

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన.. మోదీతో భేటీ..

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో బిజీకానున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిన్న హస్తినకు వెళ్లారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

 

శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులైన అమిత్‌షా, నిర్మలాసీతారామన్‌ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందంటూ ప్రతిపక్షాలు ఎన్నికల వేళ దుమ్మెత్తిపోస్తుండటంతో.. త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్‌. ఈ మేరకు సత్వరమే కేంద్రం సహాయాన్ని కోరనున్నారు. అలాగే తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపై, పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానితో చర్చించనున్నారు ఏపీ సీఎం. అనంతరం అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌లను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 

ఇక ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో పార్టీ అధినేతలు ఢిల్లీ బాటపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో పొత్తులపై చర్చలు జరిపారన్న టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జనసేనతో మిత్ర బంధం కొనసాగిస్తున్నా.. టీడీపీతో మళ్లీ స్నేహగీతంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చకు దారి తీసింది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram