మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది.
కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు అందజేసింది. ఫిబ్రవరి 17న ఆయన వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు, కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇవ్వడంపై ఆప్ స్పందించింది. న్యాయస్థానం జారీ చేసిన ఆర్డర్‌ను అధ్యయనం చేస్తున్నామని ఆఫ్ నేత జాస్మిన్ షా తెలిపారు. అందుకు తగినవిధంగా చర్యలు తీసుకుంటామమన్నారు.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఐదుసార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఇవి చట్ట విరుద్ధమని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారని కేంద్రాన్ని దుయ్యబట్టారు.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అరెస్టయి జైల్లో ఉన్నారు.