ఏపీ రాజకీయ సమీకరణలు ఎప్పుడే టర్న్ తీసుకుంటాయో? అంతుపట్టకుండా తయారైంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతో పొత్తుల లెక్కలు మారే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఢిల్లీలో పొత్తులపై ఏం తేలుతుందో కాని.. అటు చంద్రబాబు ఇంకా ఢిల్లీ చేరకుండానే.. ఏపీలో సీఎం వాయిస్ సడన్‌గా మారిపోయింది. కేంద్రంపై సడన్‌గా ముఖ్యమంత్రి స్వరం మార్చేశారు. ఇన్నిరోజులు కేంద్రానికి పరోక్ష మిత్రుడిలా కొనసాగిన జగన్ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకాలం లేనిది.. ఇప్పుడు కేంద్ర నిధుల విడుదలపై జగన్ ఎందుకు నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు?
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తనదే విజయం అని భావించారు వైసీపీ అధినేత జగన్. అయితే 2014లో టీడీపీ, బీజేపీ, బీజేపీలు కలిసి పోటీ చేయడంతో ఆయన లెక్కలు తప్పాయి. మళ్లీ పదేళ్ల తర్వాత అదే కాంబినేషన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడుతుండటం జగన్‌కు మింగుడుపడటం లేదంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జుల మార్పులు చేర్పులతో సిట్టింగులు వైసీపీకి గుడ్ బై చేప్పేస్తున్నారు. మరోవైపు ఎంపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది జగన్ పార్టీకి.
వాటితోనే తర్జనభర్జనలు పడుతున్న జగన్.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు.. చేస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో ఢిల్లీకి చంద్రబాబుకి బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో సీఎం ఉలిక్కిపడుతున్నరంట. ఆ క్రమంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జగన్ స్వరం మారిపోయింది.
ఇప్పటిదాకా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం ఉన్నట్లే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గటే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో వ్యవహరించారు. కీలకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన బిల్లు, ఆర్‌టీఐ, పౌరసత్వ సవరణ బిల్లులతో పాటు మూడు వ్యవసాయ బిల్లు వైసీపీ మద్దతు లేకపోతే పార్లమెంట్‌లో పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదంటారు. అలాంటి బిల్లులకు మద్దతు ఇవ్వాలంటే.. ఏపీకి కనీసం అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ షరతు విధించి ఉంటే రాష్ట్రానికి ఆ హోదా దక్కేదన్న అభిప్రాయం ఉంది. అలాంటి అవకాశాలను వాడుకోలేకపోయారని విపక్షాలు విమర్శిస్తున్నా.. జగన్ డోంట్ కేర్ అన్నట్లే వ్యవహరించారు.
ఆఖరికి మణిపూర్‌లో విస్తృతంగా జరిగిన హింసాకాండలో వందలాది చర్చిలు ధ్వంసపై.. పాస్టర్లపై దాడులు జరిగినప్పుడు కూడా జగన్ మాట్లాడలేదు. ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా ముఖ్యమంత్రి ఆ దాడులపై స్పందించలేదు. కేంద్రానికి తొత్తు అవ్వడం వల్లే జగన్ మణిపూర్ ఘటనపై రియాక్ట్ అవ్వలేదని.. పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పిస్తూ.. క్రైస్తవ ద్రోహి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన రియాక్ట్ కాలేదు.
అలా కేంద్రంపై విధేయత చాటుకుంటున్నారని ఎప్పటి నుంచో జగన్‌పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అలాంటి జగన్ ఇప్పుడు కేంద్రాన్ని దెప్పిపొడుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు. కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయని.. ఫైనాన్స్ కమిషన్ సూచించినట్టు కేంద్ర పన్నుల్లో వాటా.. పూర్తిస్థాయిలో అందడం లేదని.. సభాముఖంగా లెక్కలు చెప్పి మరీ విమర్శలు గుప్పించారు. దాంతో ఏపీకి ఆదాయం భారీగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు.
మరి అయిదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్.. ఇంతకాలం రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారిందిఎప్పుడైతే ఏపీలో బీజేపీ ఒంటరిగా కాకుండా టీడీపీతో పొత్తు ప్రస్తావన వచ్చిందో.. వెంటనే వైసీపీ బాస్ వాయిస్ మారిపోయిందన్న అభిప్రాయం చర్చల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కాదు కదా? ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని.. అలాగే పెండింగ్ కేసులు గుర్తు చూస్తూ .. ఇలాంటి సమయంలో కేంద్రంతో వివాదాలు అవసరమా? అని జగన్‌కు కొందరు వైసీపీ ముఖ్యులు చెప్పినప్పటికీ ఆయన వినలేదంటున్నారు. మొత్తమ్మీద పొత్తులపై ఢిల్లీలో ఏం తేలుతుందో కాని.. వైసీపీలో అప్పడే అలజడి మొదలైనట్టు కనిపిస్తోంది.