నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేటితో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్‌హమీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుపడుతూ తెలుగు తమ్ముళ్ల వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది.
స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు సహకరించాలని స్పీకర్ చెబుతున్నా పట్టించుకోని తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు.
దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే.. సభ నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని బలవంతంగా బయటకు పంపారు.
ఇక టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. దీంతో శాసనసభా సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఆందోళనకు సభ వేదికైందని.. ప్రజలకు పనికొచ్చే చర్చలు జరగకుండా ఈ రాజకీయ గందరగోళమేంటని ఆరోపిస్తున్నారు. ఇవాళ చివరిరోజైనా సభ సజావుగా జరగుతుందా..? టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమిస్తారా ? లేదంటే షరా మామూలే అన్నట్టు వైసీపీ, టీడీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.