గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. TSIICలో దాదాపు 63 వేల ఎకరాల భూములుండగా.. ధరణిలో మాత్రం 25 వేల ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. దీంతో మిగతా 38 వేల ఎకరాలు ఎక్కడున్నట్లు అని తలలు పట్టుకుంటున్నారు ధరణి కమిటీ సభ్యులు. టీఎస్‌ఐఐసీ, స్టాంపులు రిజిస్టేషన్ అధికారులతో ధరణి కమిటీ సమావేశమైన సందర్భంగా ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ధరణిలో సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, టిఎస్‌ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి రిజిస్ట్రేషన్‌లలో అనేక లోపాలు ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. 63వేల ఎకరాల టిఎస్‌ఐఐసి భూములు ఉండగా.. ధరణిలో 25వేల ఎకరాలే ఉన్నట్లు తెలింది. మరి 38వేల ఎకరాలు భూములు ఏమయ్యాయన్నదానిపై సమీక్షాసమావేశంలో చర్చించారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రెండు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ధరణి వెబ్‌సైట్‌లో లేదు. ఈ ఆప్షన్‌పై ధరణీ కమిటీ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ఒక సబ్ డివిజన్ నిషేధిత జాబితాలో ఉంటే..మొత్తం సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉంచడమేంటని ప్రశ్నించారు. ఈ సమస్య వల్ల సొంత భూదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు గ్రహించారు. భూసేకరణకు సంబంధించిన జీవోలు కూడా పూర్తి స్థాయిలో లేవని గుర్తించింది ధరణి కమిటీ.
ధరణిలో విల్ డీడ్ అమలు చేయడానికి మాడ్యూల్ లేపోవడం..ఇంతకుముందు కొనుగోలు చేసిన వ్యక్తి మ్యుటేషన్ పూర్తి చేయనందున ఇప్పటికే విక్రయించిన ఆస్తులు మళ్లీ విక్రయించబడటంతో ఇది పెద్ద సమస్యగా ఏర్పడిందని కమిటీ సభ్యులకు తెలిపారు. పలు లేఅవుట్లను ధరణిలో వ్యవసాయ భూములుగా చూపి మళ్లీ విక్రయిస్తున్నారని.. CARD సిస్టమ్‌లో 123 వర్గాల పత్రాల కోసం సదుపాయం అందించబడిందని అయితే ధరణిలో అటువంటి పత్రాలన్నింటికీ సదుపాయం లేదని అభిప్రాయ పడ్డారు కమిటీ సభ్యులు.