పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం కింద నిధుల మొత్తాన్ని పెంచుతారంటూ గత కొన్ని రోజుల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసింది. తాజాగా పార్లమెంట్ వేదికగా పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదంటూ కేంద్రం స్పష్టతనిచ్చింది.
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి రూ.8 వేలు నుంచి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని ఆయన స్పష్టంచేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు. 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
పీఎం-కిసాన్ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేలు రైతులకు అందిస్తున్నారు.