తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్వ్యూలు లేకుండానే కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారానే ఈ పోస్టులు భర్తీ చెయ్యాలని నిర్ణయించింది. పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికి రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది.
2023 జూన్ 11న రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో రెండోసారి పరీక్ష రద్దయ్యింది. తాజా వార్తతో నిరుద్యోగులు ఉద్యోగ సమరానికి సై అంటున్నారు.