E-PAPER

బీసీలకు ప్రాధాన్యం.. ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్ ఫోకస్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని.. సమావేశంలో నేతలు ఏకవాక్య తీర్మానం చేశారు. 17 సెగ్మెంట్లకు ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 309 మంది వివరాలను.. కమిటీ సభ్యులకు గాంధీభవన్ సిబ్బంది ఇచ్చారు. బుధవారం సాయంత్రంలోగా ఒక్కో సెగ్మెంట్‌కు మూడేసి పేర్లు సూచించాలని పీఈసీ సభ్యులకు నేతలు సూచించారు.

 

పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవడం టార్గెట్‌గా పెట్టుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టాలని.. ఈ సభకు ప్రియాంక గాంధీని పిలవాలని.. ఆ ప్రాంతం నేతలు సమావేశంలో కోరారు.

 

కాగా.. ఎంపీ టికెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 1-3 పేర్లను సిఫార్సు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లు తెలిసింది. సామాజిక, గెలుపు సమీకరణాలను పరిగణలోకి తీసుకుని.. అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆ షార్ట్ లిస్టును బుధవారం(ఫిబ్రవరి 7) మధ్యాహ్నం 2 గంటలలోగా షార్ట్ లిస్టును దీపాదాస్ మున్షీకి అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.

 

ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లలో 2 సీట్లు మాదిగలకు, 1 సీటు మాల సామాజికవర్గానికి కేటాయించాలని డిమాండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లకూ అవకాశం కల్పించాలని ఆ విభాగం నుంచి డిమాండ్ వ్యక్తమైనట్లు టాక్ వినిపిస్తోంది.

 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని.. జనాల్లోకి తీసుకెళ్లాలని.. కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని.. అవినీతిలో భాగస్వామ్యం అయిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

 

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలను చూస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పీఈసీ మీటింగ్ అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతి ప్రక్రియనంతా స్క్రీనింగ్ కమిటీ చేపడుతుందని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram