2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఉదయం 11.02 నిమిషాలకు ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు.
మొత్తం ఏపీ బడ్జెట్ 2.85 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. ఇక బడ్జెట్ ఆమోదం కోసం కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటిబ్లాక్‌లో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
అన్ని ప్రభుత్వశాఖలు 3.20 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లెక్కలను సవరించనున్నారు. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకే ఖర్చులు జరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంచనాలు సవరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్‌లో కేటాయింపులు చూపనున్నారు.