మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11.03 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో సంక్షేమానికే పెద్దపీట వేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు కూడా టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం దానిని తిరస్కరించారు. క్రాప్ ఇన్సూరెన్స్, కౌలు రైతులను మరచిపోయిన ప్రభుత్వం నశించాలి, బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి కారుమూరి.. అరవండి.. అరవండి.. అంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇష్టంలేనివాళ్లను పిలిపించి మరీ.. సభలో గందరగోళం చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు.
సభలో నినాదాలు చేస్తున్న 9 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పాక కూడా వారు బయటకు వెళ్లకపోవడంతో.. మార్షల్స్ తో బలవంతంగా బయటకు పింపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు బెందళం అశోక్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా వీరాంజనేయస్వామి సస్పెండ్ అయ్యారు. మంగళవారం కూడా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో.. స్పీకర్ వారిని ఒక రోజు సస్పెండ్ చేశారు.