ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 8వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగం సమయంలోనే టీడీపీ సభ్యులు నినాదాలు చేసారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాల పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.
అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ లో మధ్యలోనే వెళ్లిపోయిన టీడీపీ సభ్యులు లాబీల్లోనూ నినాదాలు చేసారు. ఆ తరువాత బీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీన నిర్వహణ పైన చర్చించారు. రేపు (మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చించనున్నారు. చర్చ తరువాత ముఖ్యమంత్రి జగన్ సమాధానం ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఈ అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం గురించి వివరించనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ మాట అమలు చేసిన తీరును జగన్ వివరిస్తారని సమాచారం.
ఈ నెల 7న ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన మూడు నెలల కాలానికి బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు. మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. 8వ తేదీన బడ్జెట్ పైన చర్చ ఆమోదం ఉండేలా బీఏసీలో నిర్ణయించారు. ఈ సారి ఎన్నికల ముందు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావటంతో ఆకర్షణీయమైన నిర్ణయాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. బడ్జెట పైన చర్చ తరువాత సీఎం జగన్ కీలక ప్రసంగం ఉంటుందని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇవి చివరి సమావేశాలు కావటంతో..చివరి రోజున ముఖ్యమంత్రి తన పాలన గురించి వివరిస్తూ..ఎన్నికల వేళ ప్రజలకు కీలక సందేశం ఇవ్వనున్నారు. దీంతో, జగన్ చేసే ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.