ఏపీలో పొత్తుల రాజకీయం మారుతోంది. టీడీపీ,జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీట్ల పంపకం పైన రెండు పార్టీల అధ్యక్షులు ఒక నిర్ణయానికి వచ్చారు. జనసేనకు 25-27 సీట్ల వరకు కేటాయించేలా చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీని పైన మాజీ ఎంపీ హరి రామజోగయ్య మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయటం కోసం జగన్ ను దించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీట్ల ఖరారు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల షేరింగ్ కీలక అంశంగా మారుతోంది. జనసేనాని పవన్ 35 సీట్లు కోరారని తెలుస్తోంది. ఈ మేరకు జాబితాతో సహా చర్చల్లో ప్రతిపాదించారని సమాచారం. కానీ, చంద్రబాబు నుంచి 25 -27 సీట్ల వరకు మాత్రమే అంగీకారం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు జనసేనకు 40 సీట్లు తగ్గితే ఓట్ల బదిలీ పైన ప్రభావం పడుతుందనే చర్చ అంతర్గతంగా జనసేన వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు ఇదే సీట్ల అంశం పైన చేగొండి హరి రామ జోగయ్య జనసేనాని పవన్ కు బహిరంగ లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ ను దించాలంటే చంద్రబాబును సీఎం చేయటం కోసమా అంటూ జోగయ్య ప్రశ్నించారు.
చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదని పేర్కొన్నారు. దామాపా ప్రకారం జనసేనకు 40-60 సీట్లు ఇవ్వాలని..అప్పుడే ఓట్ల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబును సీఎం పదవి రెండున్నారేళ్లు పవన్ కు ఇస్తామని ప్రకటన చేయాలని జోగయ్య డిమాండ్ చేసారు. రావాల్సిన నిష్పత్తిలో సీట్లు రాకపోతే జరిగే నష్టానికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేనకు ఇచ్చే సీట్ల విషయం పైన ఈ నెల 8న మరోసారి చంద్రబాబు, పవన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. జనసేన కు పవన్ కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని చెబుతున్నారు. దీంతో, సీట్ల పైన తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.