E-PAPER

ఆ కారణంతోనే నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేశాను: చిరంజీవి..

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు వెల్లడించింది. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్రం సత్కరించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇదిలా ఉండగా.. నేడు తెలంగాణ ప్రభుత్వం ‘పద్మ’ అవార్డు గ్రహితలకు ఆత్మీయ సన్మానం సభ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను దక్కించుకున్న వారందరినీ గౌరవంగా సత్కరించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవితో సహా మరికొందరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.

 

ఈ సభలో మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కడ కళాకరులు గౌరవించబడతారో.. సన్మానించబడతారో ఆ రాజ్యం సుభీక్షంగా ఉంటుంది. నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినపుడు చాలా ఆనందం వేసింది. కానీ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినపుడు అంత ఉత్సాహం లేదు. ఏదో సంతోషంగా గౌరవాన్ని పుచ్చుకుందాం అన్నట్లుగా ఉంది. కానీ ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, రాజకీయ ప్రముఖులుసహా చాలామంది గత వారంరోజులుగా నన్ను ప్రశంసలతో ముంచెత్తుతుంటే చాలా సంతోషం వేసింది. ఆ ఆనందం వర్ణించలేనిది.

 

అవార్డు ఇవ్వని అభిమానం, ఉత్సాహం, ప్రోత్సాహం.. అభిమానులు, ప్రముఖుల ద్వారా అందుకుంటుంటే ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుంది. మా అమ్మా నాన్నల పుణ్యఫలం నాకు సంక్రమించింది. ఈ అవార్డులను అనౌన్స్ చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రకంగా సన్మానం చేయాలనే ఆలోచన చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు.

 

అలాగే సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలను ఇకపై ఇవ్వనున్నట్లు తెలపడం అభినందనీయం. సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు నిలిపివేసిన అవార్డులను ఇకపై ప్రజాగాయకుడు గద్దర్ పేరు ఇస్తానని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.

 

అలాగే కళను గుర్తించి అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పీచ్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. ఇకపోతే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవు. ప్రస్తుత రాజీయాలు కూడా అదేవిధంగా నడుస్తున్నాయి. అలాంటి వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది’’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram