తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 2 గ్యారెంటీ స్కీములను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో రెండు స్కీముల అమలు చేయాలని నిర్ణయించింది. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత పథకాలను అమలుకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు.. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానం చేసింది. ఈ సమావేశాల్లోనే రెండు స్కీములను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించనుంది. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత.. బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.
అసెంబ్లీ సమావేశాల్లో.. తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే.. తెలంగాణ సంస్కృతి, జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినెట్ తీర్మానం చేసింది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న చిహ్నం రాజరిక పాలనను గుర్తుచేసేలా ఉందని.. దాన్ని స్థానంలో మన ప్రాంతపు గుర్తులు కనిపించేలా నూతన చిహ్నాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఇక.. ప్రజాకవి అందెశ్రీ రాసిన జయ జయహే పాటను తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా మార్చాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించి, తెలంగాణ సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతానికి తగిన గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వాహన రిజిస్ట్రేషన్‌లో TS కు బదులుగా TG ను పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. దీనికోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరణ చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులు, మెగా డీఎస్సీపై కూడా దృష్టి పెట్టనుంది.
జనవరి 26న రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ఖైదీలకు క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను (65)అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలను అందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను కూడా తీసుకురానున్నట్లు కేబినెట్ లో చర్చించారు.
రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించారు. ఆయా ప్రాంతాల్లో చెరకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడిన కర్మాగాలను తెరిపించేందుకు ఏమేం చేయాలో, ఏయే మార్గాలను అనుసరించాలే అన్వేషించి తగిన సలహాలు, సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు.