E-PAPER

జనసేనకు పోటీగా రంగంలోకి టీడీపీ నేత – బల ప్రదర్శన, ఆ సీటు దక్కేదెవరికి..!!

ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీట్ల ఖరారు వేళ ఆశావాహుల తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ వారంలోనే తమ అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దమయ్యాయి. దీని పైన చంద్రబాబు – పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. విజయవాడ నడిబొడ్డున రెండు పార్టీలు ఆశిస్తున్న సీటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 

సీట్ల కోసం పోటీ : టీడీపీ, జనసేన మధ్య సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం సీటు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. స్థానికంగా పోతిన మహేష్ ఆ సీటు ఆశిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఒక సీటు ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు పశ్చిమ నేతలు తమకు సీటు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీటు ఆశిస్తూ రంగంలోకి దిగారు. తనకు విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు నిర్వహించారు.

 

బుద్దా ర్యాలీ : ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారికి బుద్దావెంకన్న వేడుకున్నారు. టీడీపీ కోసం తాను కష్టపడి పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన సేవలను గుర్తించి చంద్రబాబు తనకు సీటు ఇవ్వాలని కోరారు. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా… తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబుతో పాటుగా పవన్ ను కోరుతున్నానని వెల్లడించారు. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలా మంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు.

 

సీట్లు దక్కేదెవరికి : తొలి నుంచి పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తనకు రెండు స్థానాల్లో ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలని కోరారు. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయమని చెప్పారు. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారి తాట తీస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రాణాలకు తెగించి తాను పని చేస్తున్నానని..సీటు ఇవ్వాలని అభ్యర్దించారు. అయితే, పశ్చిమం సీటుతో పాటుగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కైకలూరు, మచిలీపట్నం పార్లమెంట్ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, సీట్లు ప్రకటన వేళ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram