ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుల ఎంపిక విషయంలో చుక్కెదురైంది. ఎమ్మెల్సీల ఎంపికపై తెలంగాణ హైకోర్టులో ప్రతికూల ఆదేశాలు వెలువడ్డాయి.
తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా గవర్నర్ కోటా కింద ఎంపిక అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.
దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. వారు ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలివుంది. దీనికోసం ఏర్పాట్లు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు.. ఈ నియామకాలను నిలుపుదల చేసింది. యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనికి కారణం లేకపోలేదు. కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నవని, గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడానికి తగిన అర్హతలు లేవంటూ భారత్ రాష్ట్ర సమితి నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు ఈ ఎంపికను నిలిపివేయాలంటూ అభ్యర్థిస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.
ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వాదోపవాదాలను ఆలకించింది. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను బీఆర్ఎస్.. గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ చేయగా.. అవి తిరస్కారానికి గురైన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కారణంగా గవర్నర్ కోటా కింద శాసన మండలికి ఎంపికకు అనర్హులంటూ రాజ్‌భవన్.. ఆ ప్రతిపాదనలను వెనక్కి పంపించింది.
ఇప్పుడు అదే రాజకీయాలతో ప్రమేయం ఉన్న కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను అదే గవర్నర్ కోటా కింద ఎలా శాసనమండలికి నామినేట్ చేస్తారంటూ దాసోజు శ్రవణ, సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత హైకోర్టు.. వారి ప్రమాణ స్వీకారంపై స్టే జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.