తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిన కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇక ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర పాలన సాగించారు. కానీ ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కానున్నారు.
ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అందరిని ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే శాసనసభాపతి అయిన గడ్డం ప్రసాద్ కు లేఖ రాసిన కెసిఆర్ శాసనసభకు వెళ్లి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవలే ఆయన కోలుకుని పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ ఇప్పటికే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై, లేవనెత్తవలసిన అంశాల పైన ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా కార్యక్రమాలలో పాల్గొంటున్న కేసీఆర్ అధికారికంగా రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి, ఫిబ్రవరి నెలలో ప్రజాక్షేత్రంలోకి దిగాలని నిర్ణయించారని సమాచారం.
ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైనా, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తేనే రాజకీయంగా మనుగడ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు.