E-PAPER

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!.

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఇకమీదట ఇంజినీరింగ్‌ కళాశాలగా మారనుంది. ఈ పాలిటెక్నిక్‌ కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

 

ఈ కళాశాలలో మొత్తం 180 సీట్లుతో మూడు బీటెక్‌ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌ కంప్యూటర్ సైన్స్ (CSE), కంప్యూటర్ సైన్స్ ( ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అండ్‌ మిషన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ (డేటా సైన్స్‌) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను బుర్రా వెంకటేశం ఆదేశించారు.

 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న కళాశాలలు విశ్వవిద్యాలయాల కళాశాలలే. జేఎన్‌టీయూ(హైదరాబాద్), ఉస్మానియా యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీల ఆధ్వర్యంలో ఆ కళాశాలు నడుస్తున్నాయి. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయనుంది. మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వారి వేతనాలు తదితర అంశాలను ఆ శాఖే చేపడుతుంది. అయితే ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఏదైనా ఏదో ఒక యూనివర్శిటీకి అనుబంధంగా ఉండాలి. అంటే.. ఒక వర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవాలి. ఆ యూనివర్శిటీ రూపొందించిన సిలబస్‌ను ఆ కళాశాల పాటించాలి. పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వంటివి వర్సిటీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే కళాశాలజేఎన్‌టీయూ(హైదరాబాద్)కు అనుబంధంగా ఉండనుంది.

 

ఇంజినీరింగ్‌ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. కోస్గి పాలిటెక్నిక్‌ కళాశాలను 2014లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం 180 డిప్లొమా సీట్లు సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ బ్రాంచీలలో ఉన్నాయి. వాటికి అదనంగా బీటెక్‌ బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే ఈ కళాశాలలో హాస్టల్‌ కూడా అందుబాటులోకి వచ్చిందని అధికారి ఒకరు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram