E-PAPER

ఏపీలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల దూకుడు..

ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల దూకుడు పెంచారు. ఎన్నికల సమీపిస్తుండటంతో వైసీపీని దెబ్బకొట్టి.. అన్న జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు పీసీసీ పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. జగన్‌ కంటే ముందే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకూ ప్రజాక్షేత్రం పర్యటించనున్నారు షర్మిల. ఈ నేపథ్యంలోనే నేడు ఇచ్చాపురం నుంచి తన జిల్లాల పర్యటనను ప్రారంభిస్తారు.

 

ఏపీలో అధికారమే లక్ష్యంగా షర్మిల వ్యూహాలు రచిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే జగన్‌ బలగాన్ని తన వైపు తిప్పుకునే ఎత్తుగడలో ఉన్నారు. ఇందుకు వైఎస్ఆర్‌తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే వ్యూహంతో షర్మిల జిల్లాల టూర్‌ కూడా కొనసాగనుంది. పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన ఆమె.. క్షేత్రస్థాయి పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంది, మళ్లీ పుంజుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై క్యాడర్‌తో చర్చలు జరపనున్నారు షర్మిల.

 

ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి యాత్ర చేపట్టిన షర్మిల ఆ తర్వాత ఆ తర్వాత పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత ఎల్లుండి కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లా, 30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram