E-PAPER

భారత్ కు షాకిచ్చిన మాల్దీవులు.. ..

పాముకు పాలు పోస్తే అదే ప్రేమగా దగ్గరికి రాదు. కచ్చితంగా తన కంఠంలో దాచుకున్న విషాన్నే కాటు ద్వారా మనం ఒంట్లోకి ప్రసరింపజేస్తుంది. పాలు పోశాడు కదా అని ప్రేమ ఏం ఒలకబోయదు. ప్రస్తుతం భారతదేశం విషయంలోనూ మాల్దీవులు అలానే చేస్తోంది. మొన్నటిదాకా లక్షద్వీప్ పై అడ్డగోలుగా విషం చెప్పిన ఆ దేశమంత్రులు.. సాక్షాత్తు మన దేశ ప్రధాని మీద అక్కసు వెళ్ళగక్కారు. అంతేకాదు భారతదేశాన్ని మురికి దేశమని, హాస్పిటాలిటీ రంగంలో భారతదేశం తక్కువ స్థాయిలో ఉంటుందని కామెంట్లు చేశారు. ఎప్పుడైతే వారు ఆ కామెంట్లు చేశారు భారతదేశానికి చెందిన పర్యాటకులు మొత్తం బ్యాన్ మాల్దీవులు అనే ట్రెండు కొనసాగించారు. అంతేకాదు ఆ దేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అంతకుముందు బుక్ చేసుకున్న విమానాల సీట్లను, హోటళ్ళ గదులను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ చైనా టూర్ తర్వాత ముయిజ్జు వెంటనే తన ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టారు.

 

More

From National politics

ఆదివారం మాలేలోని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు అక్కడి కార్యాలయంలో భారతదేశ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలనే అభ్యర్థనపై ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మార్చి 15 నాటికి భారత దేశ సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆ దేశ అధికారులు భారత హై కమిషనర్ కు తెలిపారు. దీంతోపాటు భారతదేశంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించాలని వారు ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో మాల్దీవులు కోసం భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో రెండు హెలికాప్టర్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు వాటిని కూడా వినియోగించడం ఆపివేయాలని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో 77 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక గత ఏడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారతదేశాన్ని కోరారు. అప్పటినుంచి వీలు చిక్కినప్పుడల్లా మన దేశం మీద ఏదో ఒక రకంగా విషం చిమ్ముతూనే ఉన్నారు.

 

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అధికారికంగా ముయిజ్జు చైనాకు వెళ్లారు. అక్కడ పలు కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. శనివారం ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. దేశం పేరు ప్రస్తావించకుండా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా అత్యంత చిన్న దేశమైన తమపై బెదిరింపులు చేయడం సరికాదని అన్నారు. తమ దేశంపై ఎవరికీ లైసెన్సులు ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే చైనా స్పందించింది. మాల్దీవులకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే గట్టిగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది. అంటే మాల్దీవులపై పట్టు పెంచుకోవడం కోసం.. దాని ద్వారా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే చైనా రంగంలోకి దిగిందని.. అందువల్లే మాల్దీవుల అధ్యక్షుడిని తన దేశ పర్యటనకు పిలిచిందని తెలుస్తోంది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram