E-PAPER

బండి సంజయ్‌ గురించిన ఆ విషయం తెలసుకు కానీ, ఇది తెలియదు: పొన్నం ప్రభాకర్ సెటైర్లు..

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ.. జ్యోతిష్య శాస్త్రం చదివాడని తెలియదంటూ పొన్నం సెటైర్లు వేశారు. కాంగ్రెస్ సర్కారు కూలుతుందని బండి సంజయ్ చెప్పడం అవివేకమన్నారు.

 

గడిచిన ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌ను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏం చేస్తుందో బండి సంజయ్ కి ఎలా తెలుసు అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని నలుగురు పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సాంప్రదాయ ప్రకారం చేయాలన్నారు. అయోధ్య రామమందిరంపై బీజేపీ మార్కెటింగ్ ఆపాలన్నారు.

 

 

అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అంటే కూల్చే పార్టీ అని.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పారు.

 

కాగా, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అహంకారం కారణంగా అధికారం కోల్పోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram