E-PAPER

నారా లోకేష్ కు షాకిచ్చిన ఏసీబీ కోర్టు.. రెడ్ బుక్ వ్యాఖ్యలపై నోటీసులు..

టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి కోర్టు వాయిదా వేసింది.

 

కాగా ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏసీబీ కోర్టులో.. సీఐడీ వాదనలు వినిపించింది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం.. ఆ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో వ్యాఖ్యానించినట్లు సీఐడి కోర్టుకు వివరించింది.

 

ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. సీఐడీ.. న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. లోకేష్ ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని.. ఆ నోటీసుల్లో వెల్లడించింది.

 

అయితే ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు.. సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. కానీ ఆ సమయంలో లోకేశ్‌ అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు నోటీసులు అందించకుండానే వెనుదిరిగారు. ఈరోజు లోకేష్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram