ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీని చేపట్టనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు శరవేగంగా పూర్తి చేస్తోన్నారు.
ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సను ప్రభుత్వం అందించనున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయంగా, సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు వైఎస్ జగన్. విద్య, వైద్యం.. ప్రజలకు ఒక హక్కుగా లభించాలని, దీనికోసం ఎన్ని వేల కోట్ల రూపాయలనైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ హక్కులను కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్య, వైద్యరంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేశామని గుర్తు చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం చేస్తోన్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందించేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఆరోగ్యశ్రీ వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, ఈ విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని, వైద్య ఖర్చుల కోసం ప్రజలు అప్పులు పాలుకాకూడదని జగన్ వ్యాఖ్యానించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి ఎలాంటి వైద్య సహకారాన్ని అందుతోందనే విషయంపై నిరంతరంగా సమీక్ష చేయాలని జగన్ అధికారులకు సూచించారు.