E-PAPER

ఏపీలో కేంద్రబృందం పర్యటన.. షెడ్యూల్ ఇలా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. నేడు, రేపు ఏపీలో మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు రోజుల పాటు సాగే కేంద్ర బృందం పర్యటనలో మిచౌంగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన పంట నష్టాన్ని ఇతర ఆస్తులను నష్టాన్ని అంచనా వేయనున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం నేడు కృష్ణ, బాపట్ల జిల్లాలలో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో క్షేత్రస్థాయిలో మిచౌంగ్ తుఫాన్ వల్ల సంభవించిన నష్టం వివరాలను సేకరించనున్నారు. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించడానికి ముందు వారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తో భేటీ అయ్యి మిచౌంగ్ తుఫాను వల్ల జరిగిన విధ్వంసంపై ప్రాథమికంగా వివరాలు సేకరించనున్నారు.

 

ఈరోజు మధ్యాహ్నం నుంచి కృష్ణ, గుంటూరు జిల్లాలలో పర్యటించనుంది కేంద్ర బృందం. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు, జిల్లాల వారీగా ఆయా జిల్లా ఉన్నతాధికారుల నుంచి మిచౌంగ్ తుఫాన్ తో జరిగిన పంట నష్టం పై సమాచారాన్ని సేకరించనుంది. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కేంద్ర బృందానికి కావలసిన సమాచారాన్ని ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం సృష్టించింది. తుఫాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో పంట నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు. దీంతో ఏపీలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పర్యటిస్తుంది.

 

ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించి క్షేత్ర స్థాయిలో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆపై కేంద్రం ఏపీలో జరిగిన పంట నష్టంపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిస్థితిని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram