త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని దయచేసి అందరూ సహకరించాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హాస్పటల్ కు ఎవ్వరూ రావద్దని కోరారు. తనను పరామర్శించడానికి యశోద హాస్పటల్ కు తరలివస్తున్న ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్లో వీడియోను విడుదల చేశారు. హాస్పటల్ లో తనతోపాటు వందలాది మంది పేషంట్లు ఉన్నారు వారికి ఇబ్బంది కలగకూడదన్నారు. అందరూ రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకే డాక్టర్లు బయటకు పంపడం లేదన్నారు.
తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని తెలిపారు. తానెప్పుడూ ప్రజల మధ్యనే ఉండేవాడినేనన్నారు. అందుకే అప్పటి వరకు సంయమనం పాటించి యశోద హాస్పటల్ కు రావొద్దని కోరారు.
తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి కేసీఆర్ వేడుకున్నారు. తనను చూడటానికి వచ్చి ఇబ్బంది పడొద్దన్నారు. హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే ఆ వీడియో ద్వారా చేతులు జోడించి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఎవరూ రావద్దని కోరుతున్నా.. మరోవైపు చాలా మంది హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి తరలివస్తున్నారు. అక్కడ మహిళలు ఆందోళన దిగారు. కేసీఆర్‌ను చూసేందుకు సిద్దిపేట నుంచి ఆ మహిళలు వచ్చారు. వారిని యశోద ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి పంపాలంటూ ఆసుపత్రి ఎదుట మహిళలు బైఠాయించారు.