తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటుగా లోక్ సభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు ఏపీలో టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన తెలంగాణలో బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఇక..కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ సహకరించిందనే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే సుదీర్ఘ కాలం తరువాత కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శకు వెళ్లనుడటం ఆసక్తి కరంగా మారుతోంది.
కొత్త సమీకరణాలు తెలంగాణ ఫలితాలతో ఏపీలోనూ తమకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు..తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఓటు కు నోటు కేసుతో మొదలైన వివాదం పతాక స్థాయికి చేరింది. ఆ తరువాత కాంగ్రెస్ తో జత కట్టిన చంద్రబాబు బీఆర్ఎస్, బీజేపీ ఓటమి కోసం ప్రయత్నించారు.
ఏపీలో పరాజయం తరువాత రాజకీయంగా చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. స్కిల్ కేసులో రిమాండ్..సీఐడీ వరుస కేసుల సమయంలోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే, చంద్రబాబు అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ స్పందన పైన టీడీపీ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ గెలుపు తరువాత గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ప్రత్యక్షం కావటంతో కొత్త రాజకీయం పైన చర్చ మొదలైంది.
కేసీఆర్ వద్దకు చంద్రబాబు రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు అవుతారని భావించినా ఆయన దూరంగానే ఉన్నారు. రేవంత్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అటు రేవంత్ తన రాజకీయ ప్రత్యర్ది అయినా కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించాలని నిర్ణయించారు.
ఫాం హౌస్ లో బాత్రూమ్ లో జారి పడిన కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. ఆయనకు యశోదా ఆస్పత్రిలో సర్జరీ చేసారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ కు గాయం అయిన విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించేందుకు వెళ్తున్నారు.
ఎన్నిలక వేళ కీలకంగా ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ సహకరించందనే ప్రచారం దీనికి అడ్డుగా మారే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ సమయంలో చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమనే ఆలోచనతో ఉన్నారు.
వచ్చే వారం బీజేపీ నేతలతో సమావేశం కోసం పవన్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఇక, కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శ మర్యాదపూర్వకమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే..ఇప్పుడు చాలా రోజుల తరువాత కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శ అంశం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.