ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటోంది. ఇంకో నాలుగు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అటు తెలుగుదేశం- మిత్రపక్షం జనసేన ఎన్నికలపై కసరత్తు చేస్తోన్నాయి. నియోజకవర్గాలవారీగా ఇన్‌ఛార్జీలను నియమించుకుంటోన్నాయి. స్థానిక రాజకీయాలపై సమీక్షలు జరుపుతున్నాయి. ఇదివరకే రాయలసీమ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలక నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.
మరోవంక- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిని నెగ్గి జోష్ మీద ఉంది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఈ పోటీల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామనే ధీమాను ప్రదర్శిస్తోంది.
కేంద్రం- రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల మధ్య.. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు.
ఈ మధ్యాహ్నం ఆయన పార్లమెంట్ భవనంలో గల ఛాంబర్‌లో మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. ప్రధానంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల గురించే వారు మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో- రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులను విజయసాయి రెడ్డి.. మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో.. అనూహ్య పరిణామాలు: బీసీ నేతకు ఫోన్ కాల్
పోలవరం ప్రాజెక్టు బకాయిలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని కోరారు. సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రంతో సఖ్యతను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.