స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణను కోర్టు వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో (Skill case) చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబరు 8కి వాయిదా వేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.
స్కిల్ కేసుకు సంబంధించి 17ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయని విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని హరీష్ సాల్వే చెప్పారు. అదే సమయంలో ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సాల్వే వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని స్పష్టం చేసింది. తేదీ ఖరారు చేయాలని హరీశ్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. జనవరి 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.